ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతమయ్యారు. మంగళవారం ఉదయం ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
తెలంగాణ సరిహద్దుల నుంచి ప్రాణహిత నదిని దాటుకుని కొంతమంది మావోయిస్టులు ప్రవేశించినట్లు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన గడ్చిరోలి పోలీసులు మావోయిస్టులను టార్గెట్ చేశారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు మృతిచెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ నీలోత్పల్ వెల్లడించారు.
ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగిలిన మావోయిస్తుల కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సల్స్ ప్రవేశించారని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల దాడులకు చేసేందుకు మావోయిస్టులు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. రేషన్ పల్లి సమీపంలోని కోలమర్క పర్వతాల్లో మంగళవారం ఉదయం ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా నక్సల్స్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.