కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో సీజేఐ(CJI)ని తొలగిస్తూ చేసిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjeev Khanna), జస్టిస్ దీపాంకర్ దత్తా(Justice Dipankar Dutta), జస్టిస్ అగస్టీన్ జార్జి మషి(Justice Augustine George Mashi) నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కొత్త చట్టంలోని నిబంధనలపై స్టే ఇవ్వడానికీ భారత ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఫిబ్రవరి 14న అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేయడం, మార్చి 8న అరుణ్ గోయెల్ ఎన్నికల కమిషన్లుగా రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడింది. దీంతో మాజీ ఐఏఎస్ అధికారులైన జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులను ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం ఎంపిక చేసింది.
ఈ ఎంపిక నిలిపివేయాలని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై మౌఖికంగా కోరితే పరిశీలించలేమని స్పష్టం చేసింది. స్టే కోసం కొత్తగా పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. కొత్త చట్టం అమలు కాకుండా నిలిపివేయడానికి తాత్కాలిక స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది.