లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయమే లక్ష్యంగా.. ముందుకు వెళ్తున్న బీజేపీ ముఖ్య నేతలు వ్యూహంలో భాగంగా తమ పర్యటనలలో దూకుడు పెంచారు.. ఈ క్రమంలో ప్రధాని మార్చి 15,16,18 తేదీల్లో తెలంగాణ (Telangana)లో పర్యటించనున్నారు.. కాగా ఈ నెల 15వ తేదీన మల్కాజ్గిరి (Malkajgiri) పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు.
అదేవిధంగా 16వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో, 18న జగిత్యాలలో జరిగే ఎన్నికల సభకు హాజరవుతారు. ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచింది. ఈమేరకు జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో జరిగే ప్రధాని సభలకు బీజేపీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. అయితే అమిత్ షా సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై రోడ్ షో గురించి చర్చించారు.
ఈ మేరకు రేపు రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్గిరి రోడ్ షోపై సన్నాహక సమావేశం జరగనుంది. మరోవైపు ఈ నెల 16న ప్రధాని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి రానున్నారని జాతీయ బీసీ మాజీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు. బీజేపీ (BJP) నాయకులతో కలిసి బహిరంగ సభాస్థలిని పరిశీలించిన ఆయన ఏర్పాట్లను వేగవంతం చేయాలని స్థానిక నాయకులను కోరారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400 స్థానాలు బీజేపీ కైవసం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ పార్లమెంటు అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహాలను వివరిస్తూ పార్లమెంటు పరిధిలో నాయకులు కార్యకర్తలను చైతన్యం చేస్తున్నారన్నారని అన్నారు.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేందుకే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తల్లోజు ఆచారి తెలిపారు..