రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోకి ప్రవేశించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాను పాల్గొనలేక పోతున్నానని తెలిపారు.
అస్వస్థతకు గురైన ప్రియాంక.. ట్విట్టర్ (X) వేదికగా న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్న తన సోదరుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఇతర కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ క్రమంలో తాను అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొంటానని ప్రియాంక పేర్కొన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కాగా రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని చందౌలీలోకి ప్రవేశించనుంది. ఇక జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం రాహుల్ యాత్ర ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దేశ ప్రజలకు ఉపాధి కరవైందని.. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 74 శాతం మంది వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలే ఉన్నారన్నారు. భారత్లో ఉన్న 200 అగ్రశ్రేణి కంపెనీల్లో ఎక్కువగా ప్రజాధనం ఉంది. కానీ వీటిలో ఏ ఒక్కదానిలోనూ ఓ దళితుడు యజమానిగా లేడు. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ మీ జేబులను దోచుకుంటున్నారు. ఇకనైనా మేల్కోండని రాహుల్ పిలుపునిచ్చారు.