రాష్ట్ర రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పాత్ర ఏంటో తెలియక సతమతం అవుతున్నారు.. బీఎస్పీలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆయన.. ఎవరు ఊహించని విధంగా చివరికి ఆ పార్టీ పంచన చేరడం చర్చాంశనీయమైంది. అయితే ఎంపీ పదవి ఆశించి గులాబీ కండువా కప్పుకొన్నారనే ఆరోపణలు సైతం వచ్చాయి.
కానీ తాజా పరిస్థితులు చూస్తే మాత్రం.. ఆర్ఎస్పీ ఆశ అంత సులభంగా నెరవేరదని తెలుస్తోంది. అసలే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. పదవి లేకుంటే ప్రాణం పోతుందనే తీరుగా వ్యవహరిస్తున్న నేతలు పొద్దున ఒక పార్టీలో కనిపిస్తే.. సాయంత్రానికి మరో పార్టీ కండువాతో దర్శనమిస్తున్నారు. ఎవరు లోక్‌సభ టికెట్ ఇస్తామంటే వారికే జై కొడుతున్నారు.. దీంతో తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.
తాజాగా నాగర్ కర్నూల్ (Nagarkurnool) కాంగ్రెస్ (Congress) టికెట్ ఆశించిన మంద జగన్నాథం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అధిష్టానం మల్లు రవికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న జగన్నాథం, బీఎస్పీలో చేరేందుకు నిర్ణయించుకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మాయవతిని కలిసేందుకు ఢిల్లీకి ప్రయాణం అయినట్లు సమాచారం.. అదీగాక బీఎస్పీ తరపున ఎంపీగా నాగర్‌కర్నూల్ నుంచి బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు.
అలాగే బుధవారం ఉదయం బీఎస్పీ అధినేత్రి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదేగనుక జరిగితే.. బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఎన్నికల్లో షాక్ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్లతో పాటు బీఎస్పీ ఓట్లు కూడా తనకు ప్లస్ అవుతాయని భావించిన ఆయన.. అనూహ్యంగా బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నట్లు మంద జగన్నాథం (Manda Jagannatham) ప్రకటించడం.. అలాగే గతంలో నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన రికార్డ్ ఉండటం తనకు మైనస్ గా మారుతుందా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.