Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
లోక్‌సభలో కాంగ్రెస్ (Congress) పార్టీపై, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) విరుచుకుపడ్డారు.. యూపీఏ (UPA) హయాంలో జవాబుదారీతనం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకొనే నేతా ఉండేవారు కాదని విమర్శించారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని యూపీఏ హయాంతో పోల్చుతూ విడుదల చేసిన శ్వేతపత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిగా ఎవరున్నా.. అసలు సూత్రధారి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అని అన్నారు.. ఆమె వెనక ఉండి చక్రం తిప్పేవారని ఎద్దేవా చేశారు. సోనియా అనాలోచిత నిర్ణయాలతోనే ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థాయికి వెళ్లిందని నిర్మలా సీతారామన్ విమర్శించారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో అవినీతి, ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగానికి ప్రభుత్వ నాయకత్వమే ప్రధాన కారణమని.. యూపీఏ ప్రభుత్వానికి దిశానిర్దేశం లేకపోవడం, నాయకత్వం లేకపోవడమే ప్రధాన సమస్య అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో అడ్డదారిలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు, ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను అప్పగించారని ఆరోపించారు. శ్వేతపత్రంలో ఉన్న ప్రతి అంశం నిజమైనదేనని, సాక్ష్యాధారాలతో సహా వాటిని నిరూపిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ఆర్డినెన్స్‌ను చించివేశారని, ఈ చర్య దేశ ప్రధానిని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ రంగ నిర్వహణ కూడా సరిగ్గా జరగలేదని సీతారామన్ అన్నారు. రూ. 3,600 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం ప్రధానమైనదని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వ హయాంలో మందుగుండు సామగ్రి, రక్షణ పరికరాల కొరత ఉండేదని, సైనికులకు కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా అందుబాటులో లేవని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక దేశ రక్షణకు బడ్జెట్లో నిధులను గణనీయంగా పెంచామని తెలిపారు.





