Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) న్యాయవాదులతో సమావేశమయ్యారు. బెజవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో పవన్, నాదెండ్ల మనోహన్ (Nadendla Manohar) చర్చించారు.
ఈ సందర్భంగా తమ పోరాటానికి మద్దుతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌కు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.పలువురు సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జనసేన లీగల్ సెల్ చైర్మన్ ప్రతాప్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై న్యాయవాదులంతా కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు.
అన్యాయం జరిగితే.. న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. ఈ చట్టంపై న్యాయవాదులంతా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారని ప్రతాప్ తెలిపారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. నిపుణులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టం చేసిందనీ.. ప్రజలను, కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని ప్రతాప్ విమర్శించారు. భూమి హక్కుదారుడు వెళ్లి ఫిర్యాదుదారుడి కాళ్లు పట్టుకోవాలా? అని ప్రశ్నించారు.
బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అరాచకాన్ని, అశాంతిని కలిగించే దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చారని అన్నారు. సమాంతర న్యాయవ్యవస్థను తీసుకురావడం దుర్మార్గమన్నారు. వివాదాలు లేని ఆస్తులకు.. వివాదాలు సృష్టించే అవకాశం కల్పించారని తెలిపారు. ఎక్కడ స్థిరపడినా స్వగ్రామంలో ఆస్తులు ఉండటం ఆనవాయితీ అని తెలిపారు. సెక్షన్ 28 ప్రకారం అయితే ల్యాండ్, బిల్డింగ్, ప్లాట్స్ ఏదైనా అన్యాక్రాంతం చేయవచ్చన్నారు.
పోరాటం చేస్తున్న న్యాయవాదుల మధ్య కూడా చిచ్చు పెట్టాలని వైసీపీ న్యాయవాదులను రెండు గ్రూపులుగా మార్చేశారని అవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను హరించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము ప్రజల్లోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని, ఇలాంటి దుర్మార్గపు చట్టాలపై చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

