తెలంగాణ (Telangana) ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద బారికేడ్లు ఢీకొట్టిన కేసులో హైదరాబాద్ (Hyderabad) పంజాగుట్ట (Panjagutta) సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ తప్పించుకోవడానికి సీఐ దుర్గారావు కారణం అనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.. మరోవైపు భారీగా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంజాగుట్టలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని ఇటీవల సీపీకి బదిలీ చేశారు.
అయితే సీఐ దుర్గారావు సస్పెండ్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది ఇస్తున్న సమాచారంతో ఇన్ని రోజులు తప్పించుకొంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విషయం గమనించిన పోలీసులు తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన కేసులో సీఐ దుర్గారావును హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.
ఇదే కేసులో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇక ఈ ఘటన అనంతరం షకీల్ కుమారుడు సోహెల్ విదేశాలకు పారిపోయాడు.. అయితే ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా పంజాగుట్ట సీఐ, సోహెల్ కు బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో స్పందించిన పోలీసు అధికారులు, సీఐని సస్పెండ్ చేశారు.
సెక్షన్ 17 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అదీగాక ఇదివరకే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి సోహెల్ కారణమని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు షకీల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సోహెల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయలో మార్పులు జరగడంతో ఈ కేసులో వేగం పెరిగింది. నిందితులపై చర్యలకు దిగారు అధికారులు..