మహిళా క్రికెటర్లతో హెచ్‌సీఏ కోచ్(HCA Coach) అసభ్య ప్రవర్తన అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మహిళా క్రికెటర్ల (women cricketers) పట్ల కోచ్ విద్యుత్ జైసింహ(vidyuth jaisimha) అనుచితంగా ప్రవర్తించాడు.
ఈ మేరకు స్పందించిన హెచ్‌సీఏ చీఫ్ జగన్మోహన్ రావు కోచ్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. మ్యాచ్ కోసం మహిళ క్రికెటర్ల హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు విమానంలో రావాల్సి ఉంది. అయితే.. కావాలనే కోచ్ జైసింహా ఆలస్యం చేయడంతో ప్లైట్ మిస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా బస్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఈ క్రమంలో వారి ముందే జై సింహా మద్యం సేవించాడు. ఇందుకు ప్లేయర్లు అడ్డుచెప్పారు. దీంతో జై సింహా ఆగ్రహంతో ఊగిపోయాడు. మహిళా క్రికెటర్లపై దుర్భాషలాడాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు బస్‌లోనే ఉన్నాడు. అతడు జై సింహాను అడ్డుకోలేదు సరికదా ఇంకా ఎంకరేజ్ చేశాడు.
దీంతో టీమ్ నుంచి తప్పిస్తామంటూ ప్లేయర్లను కోచ్ బెదిరిస్తున్నట్లు వారు వాపోయారు. మందుతాగుతూ తమను బూతులు తిట్టాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై తాజాగా కోచ్ జైసింహా రియాక్ట్ అయ్యారు. తానూ ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. విచారణ చేయకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించాడు. తాను తాగింది మద్యం కాదు.. కూల్ డ్రింక్ అని, తానెవరినీ వేధించలేదన్నాడు.