Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై తాజాగా మరో దెబ్బ పడింది. 2020 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో తన ఓటమికి సంబంధించి ఫలితాలను తారుమారు చేయడానికి యత్నించినట్టు ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యురీ పేర్కొంది. 41 అభియోగాలతో కూడిన డాక్యుమెంట్ లో ట్రంప్ సహా 18 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.
వీరిలో ఆయన మాజీ లాయర్ రూడీ గులియానీ, వైట్ హౌస్ మాజీ చీఫ్ మార్క్ మెడోస్, వైట్ హౌస్ లాయర్ జాన్ ఈస్ట్ మన్ తదితరులున్నారు. ఈ కేసుతో ట్రంప్ నాలుగోసారి క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నట్టయింది. వ్యవస్థీకృత నేరగాడిగా ఆయనపై పరోక్షంగా అభియోగం నమోదు కావడం విశేషం,
ప్రస్తుత కేసులో ఆయన మీద మోపిన మొత్తం ఆరోపణల్లో ‘ది రాకెటీర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్’ (రికో) (The Racketeer Influenced And Corruption Organisations Act) అతి ముఖ్యమైనది. ఈ చట్టం కింద దోషిగా తేలితే గరిష్టంగా 20 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది.
సహచరులపై కూడా ఈ అభియోగాలు నమోదయ్యాయి. తన 98 పేజీల ఇండిక్ట్ మెంట్ డాక్యుమెంట్ ను జ్యురీ విడుదల చేసింది. అయితే ఎప్పటిమాదిరే ట్రంప్, ఆయన బృందం ఈ అభియోగాలను తోసిపుచ్చింది. ఇవి రాజకీయ కక్షతో చేస్తున్నవని ఆరోపించింది.