తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి(Tirumala Sri Venkateswara Swamy) వారిని దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. ప్రత్యేక సమయాల్లో అయితే తిరుమలగిరులు భక్తులతో కళకళలాడుతుంటాయి. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి భారీగా కానుకలను సమర్పిస్తుంటారు.
ఇలా హుండీ ద్వారా రోజూ కోట్లలో ఆదాయం వస్తుంటుంది. తాజాగా, తిరుమలలో వెంకన్నకు గత నెల(జనవరి)లో ఆదాయం వంద కోట్ల మార్క్‌ను దాటింది. జనవరి నెల శ్రీవారి హుండీ(Srivari Hundi) ఆదాయం రూ.116కోట్లని టీటీడీ వెల్లడించింది.
వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రావడం ఇది వరుసగా 23వ నెల కావడం విశేషం. మొత్తంగా గతేడాది జనవరితో పోలిస్తే రూ.7కోట్ల ఆదాయం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లుగా టీటీడీ తెలిపింది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తొమ్మిది కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వెల్లడించింది. గురువారం 57,223 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 18,015మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.