ఉక్రెయిన్(Ukreaine)పై రష్యా (Russia) భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దురాక్రమణను మొదలుపెట్టి రెండేళ్లు అవుతోంది. విద్యుత్ కేంద్రాలే(Power stations) లక్ష్యంగా రష్యా దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్‌కు కరెంటు కోతల(Power cuts) ముప్పు పొంచివుంది. రష్యా ఒక్కరోజులోనే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.
దీంతో పలుచోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. దీనివల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొంది. తాజా పరిణామాలతో పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు తప్పవని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిగల్(Ukraine PM Denis Shmigal) పేర్కొన్నారు. తమకు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని ఈ దాడులు నిరూపిస్తున్నాయన్నారు.
2022-23 శీతాకాలంలోనూ రష్యా ఇదేవిధమైన వ్యూహాన్ని అనుసరించింది. అయితే, తాజాగా మరోసారి ఇలాంటి దాడులను పెంచడాన్ని ‘ఇంధన తీవ్రవాదం’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. అటు ఐక్యరాజ్య సమితి కూడా ఈ తరహా దాడులు అక్రమమని పేర్కొంది. రష్యాదాడులను దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ పలుచోట్ల నష్టం తప్పడంలేదని ఉక్రెయిన్ వెల్లడించింది. ఇప్పటికే పలు నగరాలు నేలమట్టమయ్యాయి.
ఇటీవల వైమానిక దాడులను తగ్గాయి. అయితే, రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పాల్పడుతున్న దాడులకు ప్రతిస్పందనగా పుతిన్ సేనలు ఎదురు దాడులను పెంచాయి. ఈ కమంలో ఉకెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. విద్యుత్ ఉపకేంద్రాల ధ్వంసంతో కరెంటు కోతల ముప్పు మరింత పెరిగిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.