ఉక్రెయిన్(Ukraine)పై రష్యా అణుదాడి(Russian nuclear attack)కి సిద్ధమవగా ప్రధాని మోడీ(PM Modi) దాన్ని చివరి నిమిషంలో నిలువరించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్(CNN) కథనం ప్రకారం.. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ సహా పలు మిత్ర దేశాల జోక్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
రష్యా ఆక్రమిత ఖేర్సన్లోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకొస్తుండడంతో రష్యా అణుమార్గాలను ఎంచుకోవడం ఖాయమని అమెరికా భావించినట్లు ఆ కథనంలో పేర్కొంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై దాడికి సాకుగా చూపేందుకు డర్టీ బాంబు థియరీని రష్యా తెరపైకి తెచ్చినట్లు తెలిపింది.
రష్యాతో అణుదాడి ఆలోచనను విరమింపచేయాలని భారత్ సహా పలు దేశాలకు అమెరికా అధికారులు విజ్ఞప్తి చేశారు. వారి మాటతోనైనా రష్యా వెనక్కు తగ్గొచ్చనేది తమ ఆలోచన అని, ఆ తరువాత భారత్, చైనా జోక్యంతో రష్యా ఆలోచనల్లో మార్పు వచ్చిందని వారు పేర్కొన్నట్లు సీఎన్ఎన్ ప్రచురించింది.
రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్ తొలి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇది యుద్ధాలు చేసే కాలం కాదని ప్రధాని మోడీ గతేడాది షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో స్పష్టం చేశారు.