Telugu News » Kishan Reddy : ఏలేటి దీక్ష విరమణ.. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy : ఏలేటి దీక్ష విరమణ.. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్మల్‌ కు వెళ్లారు. మహేశ్వర్ రెడ్డిని ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

by admin
union-minister-kishan-reddy-fire-on-cm-kcr

– నిర్మల్ మాస్టర్ ప్లాన్ రగడ
– ఏలేటి దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు
– అయినా, దీక్ష కొనసాగింపు
– కిషన్ రెడ్డి పరామర్శ
– ఏలేటి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో..
– నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ
– లాఠీఛార్జ్ లో గాయపడిన కార్యకర్తలకు భరోసా

నిర్మల్ (Nirmal) మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తోంది బీజేపీ. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న భూములను తక్కువ ధరకు కొన్న బీఆర్ఎస్ (BRS) నేతలు వాటిని కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చుకునేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ నుంచి జీవో నెంబర్ 220ను జారీ చేయించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసనలకు దిగింది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy) ఐదు రోజులపాటు దీక్ష కొనసాగించారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాల్సిందేనని బీజేపీ శ్రేణులు నిత్యం ధర్నాలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఇతర జిల్లాల నేతలు నిర్మల్ బాట పట్టారు.

union-minister-kishan-reddy-fire-on-cm-kcr

ఆదివారం మహేశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్లేందుకు బీజేపీ నేతలు డీకే అరుణ, అరవింద్ ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. రోజురోజుకీ ఏలేటి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. ముందు గేటుకు తాళం వేసి పోలీసులను లోనికి అనుమతించలేదు. గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

గేటు తాళం పగులగొట్టిన పోలీసులు.. ఇంట్లోకి ప్రవేశించి మహేశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్లారు. ఇదే సమయంలో పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఏలేటికి పోలీసులు సూచించగా, అందుకు ఆయన నిరాకరించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయినా కూడా ఆస్పత్రి బెడ్ పై ఆయన దీక్షను కొనసాగించారు.

ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) నిర్మల్‌ కు వెళ్లారు. మహేశ్వర్ రెడ్డిని ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలపై ఇకమీద జరిగే అన్ని పోరాటాలకు బీజేపీ రాష్ట్ర శాఖ తరపున సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు కిషన్ రెడ్డి. వారం రోజులుగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. జీవో 220కి వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా మహేశ్వర్ రెడ్డితోపాటు నిర్మల్ జిల్లా యువత, రైతులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. మీ కృషి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, మహేశ్వర్ రెడ్డి ధైర్యంగా నిర్మల్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించేందుకు అమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.

‘నిర్మల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ భూమిని.. ఎమ్మెల్యే కుటుంబసభ్యుల భూ వ్యాపారానికి కావాల్నా? ఇదెక్కడి న్యాయం. నిర్మల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నరని.. కొన్నిరోజులు వెనక్కు తీసుకున్నట్లు నాటకాలాడి మళ్లీ.. తెరపైకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు మన ప్రభుత్వం మరోసారి రాదని అర్థం కావడంతోనే ఆదరబాదరాగా ఈ జీవోను తీసుకొచ్చి ఆర్థికంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రమంతా ఇదే సమస్య ఉంది. అధికార పార్టీ నాయకుల అక్రమ భూదంధాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్ భూములు, గ్రామ కమతాలు.. ఇట్లా ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేస్తున్నారు. ధరణి పోర్టల్ లో అక్రమంగా ఇలాంటి భూములను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ధరణి పోర్టల్ ప్రజలకు గుదిబండగా మారింది. ధరణి కారణంగా అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబం చేసిన హత్యలే. కేసీఆర్ కుట్రపూరిత ఆలోచనలతోనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు కిషన్‌ రెడ్డి.

You may also like

Leave a Comment