తెలంగాణ (Telangana) ప్రజలకు నూతన శకం మొదలైంది. ప్రజలందరికీ హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు.. నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రావడం వల్ల.. ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం రాలేదని విమర్శించారు..
తనకి సంబంధించిన శాఖలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్.. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో అవినీతి రహిత, పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందజేస్తామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం 60 ఏళ్ల పాటు జరిగిందని గుర్తు చేసిన మంత్రి.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం.. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిందని తెలిపారు..
తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్ల నిర్బందాలు, నియంత పాలన పారద్రోలి ప్రజలు మళ్ళీ ఒక ప్రజాస్వామ్య పాలనకు అంకురార్పణ చేశారని ఉత్తమ్ అన్నారు. ప్రజా పాలన మొదలు కావడంతో రాష్ట్రములో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలోకి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వారి విజ్ఞప్తులను అందజేస్తున్నారని మంత్రి తెలిపారు.
ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా ప్రజా భవన్ మారినట్టు తెలిపిన ఉత్తమ్.. ఇలాంటి పాలన కోసమే ప్రజలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొన్నారని అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు, అవినీతి పాలు చేసి దివాళా తీశారని మండిపడ్డారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రజలకు మేలు చేసే విధంగా నేడు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు..