మేడిగడ్డ (Madigadda)ను బీఆర్ఎస్ నేతల బృందం నేడు సందర్శించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కాళేశ్వరం (Kaleswaram) చిన్న సమస్య అని కానీ, కాంగ్రెస్ (Congress) నేతలు భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని కేటీఆర్ (KTR) విమర్శించారు.. ఈ నేపథ్యంలో గులాబీ నేతల తీరుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు..
నేడు సచివాయంలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. పలు కీలక విషయాలు వెల్లడించారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర ఉందని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య అలాయ్ బలయ్ లేకపోతే రూ. లక్ష కోట్ల రుణం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక అందిందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ వెల్లడించారు.. మేడిగడ్డ నిర్మాణంలో లోపం ఉన్నందున ఎల్అండ్ టీ కంపెనీకి చెల్లించాల్సిన రూ. 400 కోట్ల బిల్లులను ఆపామని తెలిపారు.
దీనివల్ల రాష్ట్రంకు చాలా అన్యాయం జరిగిందని మండిపడ్డ ఉత్తమ్.. జరిగిన నష్టానికి ఇరిగేషన్ లో ఉన్న లోన్లన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలని తెలిపారు.. నిజాలు దాచడానికి మేడిగడ్డ వెళ్లారా.. లేక సత్యాలు ఒప్పుకోవడానికి వెళ్లారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మరోవైపు తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేవని అసత్య ప్రచారం చేశారు కానీ అక్కడ 160 టీఎంసీల నీళ్లున్నట్టు సీడబ్ల్యూసీ వెల్లడించిందని గుర్తుచేశారు..
బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనపై గరం అయిన ఉత్తమ్.. మేడిగడ్డ.. ఓ బొందల గడ్డ.. ఏం పీక పోతరు అన్నోళ్లు ఇప్పుడు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తి పడి బీఆర్ఎస్ లీడర్లు తెలంగాణ (Telangana) రైతుల భవిష్యత్ పణంగా పెట్టారని ఆరోపించారు.. ఎన్టీఎస్ఏ కమిటీని మేడిగడ్డ విచారణ కోసం ఆహ్వానించడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.. వారు ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు..
రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానన్నారు. నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు. మరోవైపు ప్రాణహిత చేవెళ్ల ను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తదనే కుట్రతోనే కేసీఆర్ రీ డిజైన్ చేశారని ఆరోపించారు.. మేడిగడ్డ వెళ్తున్న BRS నేతల బస్సు టైర్ బ్లాస్ట్ అయింది.. ఇప్పటికే కారు షెడ్డుకు పోయింది. దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏంటంటే.. చేసిన పాపాలు ఎక్కడికిపోవని తెలుస్తోందని ఎద్దేవా చేశారు..