స్కూల్ వ్యాన్, బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు చిన్నారులు, డ్రైవర్ మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15మంది పిల్లలకు గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అక్కడ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాద వార్త తెలియగానే మృతిచెందిన చిన్నారుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషయంగా ఉన్న పిల్లలను మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కుమార్తె కూడా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్కూల్ వ్యాన్‌లోనే ఉంది. రెండు వాహనాలు (బస్సు, వ్యాన్) పాఠశాలకు వెళ్లేవి. మయూన్ పట్టణంలోని ఎస్ఆర్‌పీఎస్ (SRPS) ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు తీసుకువెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మయూన్-నబీగంజ్ రహదారిపై రెండు పాఠశాల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వ్యాన్ డ్రైవర్, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. రెండు వాహనాలు అతివేగంతో రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.