కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు (V.Hanumantha Rao) ఈ మధ్యకాలంలో బీజేపీని టార్గెట్ చేసినట్టు ఉన్నారని ఆయన విమర్శలు వింటున్న వారు అనుకొంటున్నారు. ఇదివరకే అయోధ్య (Ayodhya)లో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకు సంబంధించి, భద్రాచలం రాముడికి ఆహ్వాన పత్రిక అందక పోవడంపై ఘాటుగానే స్పందించిన వీహెచ్.. తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు..
రాముడిని ఆయుధంగా మార్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ (BJP) చూస్తోందని ఆరోపించారు. ప్రజల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి వస్తున్న ఇమేజ్ చూసి బీజేపీ ఓర్వలేక పోతోందని అన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ (Congress) ప్రవాహాన్ని ఆపలేరని తెలిపారు. చేసిన అభివృద్ధి లేదు కానీ.. హిందు ఓట్ల మీదనే బీజేపీకి ప్రేమని వీహెచ్ మండిపడ్డారు.
రాముడు మీ ఒక్కడికే దేవుడా అని ఘాటు వ్యాఖ్యలు చేసిన హనుమంతరావు.. మోడీ (Modi) అన్ని దేవాలయాలు తిరగవచ్చు.. కానీ రాహుల్ గాంధీకి మాత్రం ఆలయాలకు వెళ్లాలంటే అనుమతి అవసరమా?.. అని ప్రశ్నించారు. మీరు పిలిచినప్పుడే గుడికి పోవాలా అని మండిపడ్డారు. అయోధ్యలో ఉన్న దేవుడే రాముడా?.. భద్రాచలంలో ఉన్నది రామయ్య కాదా అని బీజేపీపై విరుచుకుపడ్డారు.
నాకంటే ఎక్కువ రామ భక్తులు ఉన్నారా?.. అని పేర్కొన్న వీహెచ్.. రాహుల్ గాంధీని అస్సాం సీఎం హేమంత్ బిశ్వ.. రావణుడు అనడాని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మోడీ రాముడా.. రాహుల్ గాంధీ రావణుడా.. ఇది ఏం న్యాయమని మండిపడ్డారు. వందల మంది మహిళలు మణిపూర్‌లో చనిపోతే మోడీ వెళ్ళలేదు.. కానీ పార్లమెంట్ ఎన్నికల కోసం.. హిందూ ఓట్లు రాబట్టుకోవాలనే ఆలోచనతో అయోధ్య అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆరోపించారు..