ప్రేమ పేరుతో ఓ దళిత యువతి దారుణంగా మోసపోయింది. విశాఖ (Visakhapatnam)లో చోటుచేసుకొన్న ఘటన వివరాలు తెలుసుకొంటే.. ఒడిశా (Odisha) రాష్ట్రం నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను, ఓ వ్యక్తి ప్రేమ పేరుతో వంచించాడు. మాయమాటలు చెప్పి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం తన మిత్రుడికి ఆ బాలికను అప్పగించాడు.. ఇలా నమ్మిన వాడు మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
అందులో భాగంగా ఆర్కే బీచ్ (RK Beach)కు వెళ్లింది. అక్కడ బాధలో ఉన్న ఆ బాలికను, పర్యాటకుల ఫొటోలు తీసే ఓ వ్యక్తి గమనించి.. విషయం ఆరా తీశాడు.. ఆ బాలికని నమ్మించి న్యాయం జరిగేలా చూస్తానని తన వెంట తీసుకెళ్ళాడు.. జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లి.. మరో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి.. ఆ మానవ మృగాలు రెండు రోజులపాటు బాలికపై అత్యాచారం చేశారు.
ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకొన్న బాలిక ఒడిశాలోని కలహండి (Kalahandi) జిల్లాలో ఉన్న తన స్వగ్రామానికి వెళ్లింది. మరోవైపు ఇంటినుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే ఆమె తల్లిదండ్రులు, తన కుమార్తె కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నాల్గో పట్టణ పోలీసులు, 22న ఆమెను గుర్తించారు. ఆ బాలికను విశాఖలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
అయితే తాను అనుభవించిన బాధను.. మోసపోయిన విధానాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నగరానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా బాలికను మోసం చేసిన ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉండగా వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.