తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నం అవుతున్న కొద్ది నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తారో అంచనా వేసి వెల్లడించగా.. అధికారపార్టీ నేతలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ హోప్ తో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు విజయం తమదే అనే ధీమాతో ఉన్నట్టు తెలుస్తుంది.
అధికార పీఠం అరచేతిలోకి రావడానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ప్రధాన పార్టీలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. కాగా ఓటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారి (Election Officer) వికాస్ రాజ్ (Vikas Raj)తెలిపారు. రేపు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపిన ఎన్నికల అధికారి.. సాయంత్రం 5గంటలకు ఫలితాలను వెల్లడిస్తామన్నారు..
మరోవైపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49కేంద్రాలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడించారు. కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుళ్లు, మిగిలిన నియోజకవర్గాల్లో 14 టేబుళ్లు.. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 500 ఓట్లకు ఒక టేబుల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
కాగా 2018 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గిందన్నారు. మరోవైపు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు..
స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. ఒక డీసీపీ స్థాయి అధికారి.. ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్ఐలతో పాటు కేంద్ర బలగాల పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉందని వెల్లడించారు. కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించినట్టు అధికారులు తెలిపారు.