వరంగల్ (Warangal) జిల్లా ఎనుమాముల మార్కెట్ (Enumamula Market)లో మిర్చి రైతులు (Chilli Farmer) ఆందోళన చేపట్టారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ యార్డు వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఎనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్కెట్ వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధరలు సగానికి సగం తగ్గించారని ఆరోపిస్తూ.. నేటి ఉదయం రైతులు కార్యాలయాన్ని ముట్టడించారు..
మొన్నటి వరకు రూ. 25 వేలు పలికిన వండర్ హాట్ రకాన్ని ప్రస్తుతం రూ. 15వేలకే ఖరీదు చేశారని మండిపడ్డారు. 15 వేలు అమ్మే 1048, 5531 రకం మిర్చిని రూ.8 వేలకు, తేజా రకం రూ.20వేలు ఉండగా రూ.12 వేలకు ఖరీదు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేదాక కదిలేది లేదని రోడ్డుపై బైటాయించారు దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
రైతుల ఆందోళనతో ఎనుమాముల మార్కెట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మిర్చి ధర పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. మిర్చి ధరను వ్యాపారులు కావాలనే తగ్గించి కొనుగోలు చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు.. అప్పులు తెచ్చి పంటను పండిచామని, ఇలాగైతే కుటుంబం రోడ్డున పడుతుందని వాపోయారు.