ఎండలో నడుస్తుంటే నీడ పడడం కామన్. కానీ, కొన్నిసార్లు ఇది సాధ్యం కాదు. ఆ రోజును జీరో షాడో డే (Zero Shadow Day) అంటారు. ఏడాదికి రెండు సార్లు ఇది జరుగుతుంటుంది. ఆ రోజుల్లో ఎండలో నడిచినా మన నీడ పక్కన కనిపించదు. తాజాగా బెంగళూరు (Bengaluru) వాసులు ఈ అనుభూతిని పొందారు. శుక్రవారం మిట్ట మధ్యాహ్నం సమయంలో కొద్ది సేపు ఎండలో నిల్చుని చూశారు. తమ నీడ కనిపించకపోవడంతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు.
ఎందుకిలా జరుగుతుంది?
జీడో షాడో డే నాడు కొద్దిసేపు మాత్రమే నీడ కనిపించదు. అదికూడా మిట్ట మధ్యాహ్న సమయంలో మాత్రమే. సూర్యూడి (Sun) చుట్టూ భూమి తిరిగే క్రమంలో రొటేషన్ యాక్సిస్ 23.5 డిగ్రీల మేర వంగిపోతుంది. ఈ క్రమంలోనే మన వాతావరణంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే.. కాంతి తీవ్రతలో మార్పు జరుగుతుంది. భూగోళంపై కర్కట రేఖ, మకర రేఖల మధ్య, అంటే, 23.5-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాల మధ్య మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయా ప్రాంతాలపై నిట్టనిలువుగా పడినప్పుడు.. ఆ ప్రాంతంలో నీడ కనిపించదు.
మన దగ్గర ఇది అన్ని ప్రాంతాలలో చూడడానికి కుదరదు. హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు, భువనేశ్వర్, ముంబై (Mumbai) లలో తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా రెప్ప పాటులోనే జరిగినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం దాదాపు నిముషం పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. తాజాగా బెంగళూరులో జీరో షాడో డే జరుపుకున్నారు ప్రజలు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చి.. తమ నీడ ఉందా లేదా? అని చెక్ చేసుకున్నారు.
మొన్న ఏప్రిల్ నెలలో కూడా బెంగళూరు వాసులు ఈ జీరో షాడో డే ను చూశారు. హైదరాబాద్ ప్రజలు అయితే.. మే నెలలో ఓసారి, ఈ ఆగస్టు 3న రెండోసారి చూశారు.