అగ్రరాజ్యం అమెరికా(USA)ను మంచు తుపాన్(Winter Storm) భయపెడుతోంది. దీని ప్రభావంతో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు 2వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. మిడ్వెస్ట్ చుట్టూ పక్కల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. మరో 2400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారని చెప్పారు. చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌లో 40శాతం విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. ఇందులో 36శాతం విమానాలు ఈ ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉండగా ఇక చికాగో మిడ్వెస్ట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘737 మ్యాక్స్ 9 విమానాల’ ల్యాండింగ్‌లో ఇబ్బంది ఉండటంతో.. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక, తీవ్రమైన మంచు తుఫాన్ కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
తీవ్రమైన గాలులతో గ్రేట్ లేక్స్, సౌత్ ఏరియాలో సుమారు 2,50,000 ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇల్లినాయిస్లో దాదాపు 97,000 మంది చీకటిలో ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన ఈ తుపాన్ యునైటెడ్ స్టేట్స్ తూర్పు భాగంలో వ్యాపించి ఉందని సీఎన్ఎన్ రిపోర్ట్ వెల్లడించింది.