విశాఖపట్నం (Visakhapatnam) లో వైఎంసీఏ తీరానికి కొట్టుకొచ్చింది, చెక్క పెట్టె (Wooden Box) కాదని, అది కేవలం చెక్క దిమ్మేనని పురావస్తుశాఖ అధికారులు తేల్చి చెప్పారు. నిన్న రాత్రి తీరానికి కొట్టుకొచ్చింది భారీ చెక్క పెట్టని అందులో నిధులు(Treasure), నిక్షేపాలు ఉన్నాయంటూ భారీగా ప్రచారం జరిగింది. దీంతో ఈ పెట్టెను చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు.
ఇది నాలుగు పలకలుగా, పురాతన పెట్టెలా ఉండటంతో ఇదేదో రాజులు, బ్రిటీష్ కాలం నాటి నిధుల పెట్టె అని విశాఖలో పెద్ద టాక్ నడిచింది. ఈ వార్త వైరల్ అయ్యింది. చివరకు స్పాట్ కు చేరుకున్న పోలీసులు, పురావస్తుశాఖ అధికారులు దీన్ని పరిశీలించారు. ఇది అసలు పెట్టె కాదని, కేవలం ఒక చెక్క దిమ్మె అని తేల్చేశారు.
ఈ తరహ చెక్క దిమ్మెలు సముద్రంలో ప్రయాణాలు చేసే షిప్పులు, బోట్లలో ఉంటాయని స్పష్టం చేశారు. అటుపోట్ల సమయంలో షిప్పులు, బోట్లను బ్యాలెన్స్ చేసేందుకు వీటిని ఉపయోగిస్తుంటారని తెలిపారు. దీంతో ఏదో తీరానికి కొట్టుకొచ్చిన పురాతన పెట్టెలో ఏముందా అని ఉదయం నుంచీ అక్కడే పడిగాపులు కాసిన వారికి నిరాశే ఎదురైంది.
అయితే విశాఖ తీరంలో ఆర్కే బీచ్ సమీపంలో, పెద జాలరిపేటలో రెండు బంకర్లు ఉన్నాయి. ఇవి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం వినియోగించినవి. ఇవి కొంతకాలం క్రితం సడెన్ గా తీరంలో కనిపించడంతో వీటిలో కూడా నిధులున్నాయంటూ హంగామా జరిగింది. ఆ తర్వాత ఇవి యుద్ధ సమయంలో ఉపయోగించే బంకర్లు అని తేలింది. ప్రస్తుతం ఇవి కూడా తీరంలో సందర్శకులకు కనిపిస్తుంటాయి.