చంద్రబాబు(Chandrababu)కు ఓటేస్తే బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోసినట్లే అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) విమర్శించారు. అనకాపల్లి జిల్లా(Anakaplly District) చోడవరం(Chodavaram)లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తూరు జంక్షన్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సూపర్ 6, సూపర్ 7, బెంజ్ కారు హామీలను ఇస్తున్నారని అన్నారు.
దేవుడిని కొలిచే గోవిందా.. గోవిందా.. నామస్మరణకు చంద్రబాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా.. గోవిందా..కు చాలా తేడా ఉందన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా.. గోవిందా.. అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రాజీపడ్డంతో ప్రత్యేక హోదా, విభజన హామీలు, అన్ని హంగులు వున్న వైజాగ్‌ను వదిలేసిన చంద్రబాబు.. గ్రాఫిక్స్ రాజధాని చూపించాడంటూ మండిపడ్డారు.
చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒక్క పథకమూ ప్రజల్లో లేవని గుర్తు చేశారు. దోచుకున్న డబ్బులు తో ఓటుకు 2వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని, ఒక్కోదగ్గర రూ.3వేల నుంచి రూ.5వేలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారంటూ ఆరోపించారు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని ఓటుమాత్రం జగన్‌కే వేయాలని కోరారు. అవినీతి సొమ్ము కాబట్టి తీసుకోవడంలో తప్పులేదన్నారు. ఎన్నికల్లో మాత్రం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. వైసీపీకి ఓటేస్తే పథకాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. అదేగనక చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే అని హెచ్చరించారు. ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యమని వెల్లడించారు. చంద్రబాబు హామీలను నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే అవుతుందని అన్నారు. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావని.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.