కాంగ్రెస్ (Congress)లో చేరే విషయంపై వైఎస్ఆర్ టీపీ (YSR TP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో కలిసి పని చేసేందుకు తాను రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరే విషయంపై మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఈ విషయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని పేర్కొన్నారు.
కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయకు వెళ్లారు. కొడుకు, కాబోయే కోడళుతో కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం షర్మిలా మాట్లాడుతూ… తన కుమారుడి వివాహం నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయకు వచ్చినట్లు పేర్కొన్నారు. తాను రేపు ఢిల్లీకి వెళ్తున్నట్టు వెల్లడించారు. అక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం అవుతానని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు తన వంతు కృషి చేశానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీకి పెట్టలేదన్నారు. తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తమ పార్టీ పోటీలోకి దిగనందునే తెలంగాణలో 31 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు.
అంతకు ముందు హైదరాబాద్ లోటస్ పండ్ లోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల అత్యవసరంగా సమావేశం అయ్యారు. కాంగ్రెస్లో చేరికపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నేతలతో ఆమె చర్చించినట్టు సమాచారం. మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీలో షర్మిలకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని తెలిపారు. ఆమె గురువారం కాంగ్రెస్ లో చేరతారని స్పష్టం చేశారు. పార్టీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చారని వెల్లడించారు.