కాంగ్రెస్ (Congress) నేత వై.ఎస్. షర్మిల (YS Sharmila) తన కొడుకు వై.స్. రాజారెడ్డి (RajaReddy) వివాహానికి రావాలంటూ పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ శత్రులు.. మిత్రులు అంటూ చూడకుండా.. ఏపీ, తెలంగాణాలో ఉన్న నేతలను కలుస్తున్నారు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు.. కేటీఆర్ (KTR)కు పత్రికను అందించిన షర్మిల.. నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటికి సైతం వెళ్లారు..
ఈ నెల 18వ తేదీన వై.ఎస్. రాజారెడ్డి.. అట్లూరి ప్రియల నిశ్చితార్ధం జరగనుంది. వివాహాన్ని ఫిబ్రవరి 17న నిశ్చయించారు.. ఎన్నికల సమయంలో మాటలకందని విధంగా విమర్శించుకొన్న నేతలంతా.. ఈ వివాహం నేపథ్యంలో ఒకచోట కనిపించడంపై రాజకీయాల్లో ఆసక్తి నెలకొందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల ఇక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
అనంతరం ఏపీకి వెళ్ళిన షర్మిల, జనవరి 4వ తేదీన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే తన కుమారుడి పెండ్లికి పిలిచేందుకే వచ్చానని మీడియాకు తెలిపారు. కాకపోతే తన తండ్రి వైఎస్సార్ (YSR) గురించి తమ మధ్య ప్రస్తావన వచ్చిందని, వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నామన్నారు.
అయితే కొన్ని అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజకీయాలు మాత్రమే తమ జీవితం కాదన్నారు. ఇది ప్రజల కోసం చేస్తున్న సర్వీస్ అని స్పష్టం చేశారు. ఈ సర్వీస్ చేసే సమయంలో ఒకరినొకరు మాటలు అనుకుంటామని.. రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనాల్సి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మన దేశానికి మంచి జరుగుతోందని.. మత హింసలు తగ్గుతాయని.. అందుకే రాహుల్‌ను ప్రధానిని చేయాలని వైఎస్సార్ అనుకొన్నట్టు తెలిపారు.