2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా పోటీ చేయనున్నారు. నిక్కీ హేలీ, హిరీష్ వర్ధన్, వివేక్ రామస్వామి, శివ అయ్యాదురై ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముంబైలో పుట్టి 1970 ప్రాంతంలో అమెరికా వెళ్లి స్థిరపడిన శివ అయ్యాదురై పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూజెర్సీ లోని ప్యాటర్సన్ లో స్థిరపడిన 59 ఏళ్ళ ఆయన మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నాలుగు డిగ్రీలు పొందారు. గత ఏడాది ట్విట్టర్ సీఈఓ పదవిని చేబట్టాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఈ-మెయిల్ ను కనుగొన్న ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు వివిధ వ్యాధుల చికిత్సలో పరిశోధనలు చేసే ‘సైటో సాల్వ్’ సంస్థ ఫౌండర్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వివేక్ రామస్వామి.. తాను అమెరికా అధ్యక్షుడైన పక్షంలో.. మాజీ అధ్యక్షుడు, అభిశంసనకు గురయిన డోనాల్డ్ ట్రంప్ ను క్షమించి వదిలేస్తానని ప్రచారం చేస్తున్నారు. కేరళకు చెందిన ఈయన..సౌత్ వెస్ట్ ఓహియోలో స్థిరపడ్డారు. 2014 లో రోవియంట్ సైన్సెస్ ని ఆయన స్థాపించారు. ఇది కూడా ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కంపెనీయే.
హిరీష్ వర్ధన్ విషయానికి వస్తే 2017 లోనే న్యూజెర్సీ పాలిటిక్స్ లో ప్రవేశించారు. న్యూజెర్సీ గవర్నర్ పదవికి అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2003 లో ఆయనకు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ యేస్ట్రో నాటిక్స్ సంస్థ .. ఏవియేషన్ అంబాసిడర్ అవార్డునిచ్చి సత్కరించింది. 2020 లో అమెరికన్ సెనేట్ కి పోటీ చేసి ఓడిపోయారు. హిరీష్ వర్ధన్ కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
51 ఏళ్ళ నిక్కీ హేలీ సౌత్ కెరొలినా గవర్నర్ గా రెండు సార్లు కొనసాగారు. ఐరాసలో ఈమె లోగడ అమెరికా రాయబారిగా కూడా వ్యవహరించారు. భారత సంతతికి చెందిన ఈమె గతంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ వద్ద కొంతకాలం పని చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో నిక్కీ విజయం సాధించాల్సి ఉంది.