భారత దేశం.. పుణ్య భూమి, ధర్మ భూమి, వేద భూమి. ప్రకృతిని, పశు పక్ష్యాదులనూ పూజించే పుణ్య ప్రదేశం. ఎన్నో ఆలయాలు, కట్టడాలు భారతీయ హిందూ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మన దేశంలోనే కాదు.. విదేశాలలోనూ హిందూత్వ మూలాలు కనిపిస్తాయి. ఎందరో దేవుళ్లు ఆయా ప్రాంతాల్లో పూజలు అందుకుంటూ ఉన్నారు. కాకపోతే, వాళ్ల భాష, ప్రాంతానికి తగ్గట్టు పేర్లు మార్చుకున్నారు. జపాన్ లో పూజలందుకుంటున్న హిందూ దేవుళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన హిందూ (Hindu) దేవతలను జపాన్ (Japan) ప్రజలు కూడా అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. తమ దేశంలో హిందూ దేవతలకు ఆలయాలు (Temples)నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. హిందూ దేవతలైన శివుడు, గణపతి, సరస్వతి, లక్ష్మీ దేవీలకు జపాన్ లో వందలాది ఆలయాలు ఉన్నాయి. కానీ, ఆ దేవతామూర్తులను వేరు వేరు పేర్లతో అక్కడి ప్రజలు కొలుస్తున్నారు.
జపాన్ ప్రజలు శివున్ని దైకోకుటేన్ పేరుతో పూజిస్తారు. దైకోకుటేన్ ను పూజిస్తే అదృష్టం, సంపదలు కలుగుతాయని జపాన్ ప్రజల నమ్మకం.
ఇక విష్ణు భగవానున్ని నరెంటేన్ పేరుతో జపాన్ ప్రజలు కొలుస్తున్నారు. హిందు మతంలో త్రిలోక రక్షకుడిగా మహా విష్ణువును అంతా భావిస్తారు. అదే విధంగా అటు జపాన్ ప్రజలు కూడా ఈ విశ్వాన్ని విష్ణువు రక్షిస్తారని విశ్వసిస్తున్నారు.
సృష్టికర్త బ్రహ్మను బోంటెన్ పేరుతో పిలుస్తారు. నిత్యం పూజలు చేస్తుంటారు జపాన్ వాసులు.
అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీ దేవి కిచీ జోటెన్ గా జపాన్ లో పూజలు అందుకుంటోంది.
విఘ్నాలను తొలగించి బుద్దిని ప్రసాదించే వినాయకున్ని కంగిటెన్ అని జపాన్ ప్రజలు పూజలు చేస్తున్నారు.
ఇక స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రున్ని తైషా కుటెన్, అగ్ని దేవున్ని కాటెన్, యమధర్మరాజును ఎమ్మాటెన్ పేర్లతో పూజిస్తున్నారు.
చదవుల తల్లి ఆ సరస్వతీ దేవీని జపాన్ ప్రజలు బెంజాయిటెన్ పేరుతో కొలుస్తున్నారు. జపాన్ లో వందలాది సరస్వతీ ఆలయాలు ఉన్నాయి. ఒక్క టోక్యోలోనే 131 సరస్వతీ ఆలయాలు ఉండటం విశేషం. బెంజాయిటెన్ ను జపాన్ ప్రజలు తమకు మధురమైన స్వరం, సంపద, అదృష్టం, అందం, ఆనందం, వాక్చాతుర్యం, జ్ఞానం, బలాన్ని ప్రసాదించే దేవతగా పూజిస్తారు.
హిందూ ధర్మంలో లాగానే జపాన్ ప్రజలు కూడా అష్ట దిక్పాలకులను పూజిస్తున్నారు. తూర్పు దిశకు అదిపతి ఇంద్రున్ని తైష కుటేన్, ఆగ్నేయం దిశకు అధిపతి అగ్ని దేవున్ని కాటెన్, దక్షిణ దిశకు ఎమ్మా (యముడు), నైరుతి దిశకు రసత్సు (నిరృతి), పశ్చిమ దిశకు సుయ్ (వరుణుడు), వాయవ్య దిశకు ఫుటెన్ వాయువు, ఉత్తరం బిశమోన్ (కుబేర), ఇశాన్యం దిశకు ఇశాన అని పూజలు చేస్తున్నారు.
ఇక సూర్యున్ని నిటెన్, చంద్రున్ని ఘటెన్, భూమిని జిటెన్, నీటిని సుటెన్ పేర్లతో పిలుస్తున్నారు. నాగ జాతిని ర్యు, యక్షులను యశ, గందర్వులను కెంతత్సభ, అసురులను అశురా, గరుడను కరురాలుగా జపాన్ పురాతన బౌద్ద గ్రందాలు పేర్కొన్నాయి.