సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram)నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం (Khammam) గ్రామీణ మండలం తెల్దారుపల్లిలో ఉన్న తన స్వగృహంలో ఉదయం ఛాతీ నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు మొదట ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు పరీక్షలు చేసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad), ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ (AIG) ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ (Health Bulletin) విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు.
ఆయన ప్రస్తుతం గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. వీరభద్రంకు ఊపిరితిత్తుల్లో నీరు చేరుకొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయనకు వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ల వైద్యుల బృందం ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్ విడుదల చేశారు.
గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు. తాజాగా, మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, శాసనసభ్యులు హరీశ్‌రావుతోపాటు పలువురు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన హరీశ్‌రావు.. వీరభద్రం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు ఎస్.వీరయ్య, నరసింహారావు, పి.ప్రభాకర్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకొంటున్నారు..