బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అంబేడ్కర్ (Ambedkar jayanthi) 133వ జయంతి సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భారత రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన బాబా సాహెబ్ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేశంలోని రాజకీయ పార్టీలు అవలంభిస్తున్న తీరును చూస్తుంటే రాజ్యంగం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. సమాజంలో మార్పు రావాలని అంబేడ్కర్ ఎంతగానో కృషి చేశారు. అంబేడ్కర్ ఒక్క దళిత సమాజానికే నాయకుడు కాదు.. గాంధీ అంతటి మహాత్ముడు అంబేడ్కర్. ఆయన చెప్పిన బాటలోనే కేసీఆర్ గారు అడుగులు వేశారు.
బోధించు, సమీకరించు, పోరాడండని ఆనాడే అంబేడ్కర్ గారు చెప్పారు. అందుకే కేసీఆర్ ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి బోధించాడు, జనాన్ని సమీకరించాడు , పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. అంబేడ్కర్ సేవలకు గుర్తుగానే హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం పెట్టాం. నూతన సచివాలయంకు అంబేడ్కర్ గారి పేరే పెట్టుకున్నాం.
స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యం అని చెప్పిన నాయకుడు అంబేడ్కర్. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 1028 గురుకుల పాఠశాలలు నిర్మించుకున్నాం.ఎంతో మంది పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దాం. ఆధునిక భారతదేశానికి పునాదులు వేసిన ఘనత అంబేడ్కర్ గారిది అని కొలంబియా యూనివర్సిటీనే చెప్పింది’ అని కేటీఆర్ అంబేడ్కర్ గొప్పతనాన్ని అభివర్ణించారు.