భారత వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. దేశంలో ఈఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం (Rainfall) నమోదు అవుతుందని అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది.. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు-సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది.

మరోవైపు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. జూన్ నాటికి ఎల్నినో బలహీనపడనుందని తెలిపారు.. మే నెల నాటికి ఎల్నినో మరింత బలహీనపడి, జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జులై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున మంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు..
అలాగే ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులు, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.. మరోవైపు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఇటీవల అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిల్లీమీటర్లలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది.