ఆ గ్రామానానికి ఇంకో దారిలేదు. చదువు కావాలంటే.. చదువుకోవాలంటే నది దాటాల్సిందే. ఎందుకంటే, నదికి ఆవల వైపు బడి.. అది దాటాలంటే ప్రతి విద్యార్థికి చావు ఒడి. మధ్యప్రదేశ్ అశోక్ నగర్ జిల్లా తుమెన్ గ్రామంలోని విద్యార్థుల సమస్య ఇది. స్కూల్ కు వెళ్లాలంటే త్రివేణి నది దాటాల్సి వస్తోంది. అది కూడా చెక్కలకు తాడు కట్టి నిర్మించిన వంతెనపై. తాడు తెగిందంటే వాళ్లకి ప్రపంచంతో సంబంధం తెగిపోయిందన్న మాటే. పోనీ వంతెన మార్గం కాకుండా మరో దారిలో వెళ్లాలనుకుంటే 5 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాలి. పాఠశాలకు వెళ్లేందుకు ఎక్కువ సమయం అవుతుండడం వల్ల.. ఈ తాత్కాలిక వంతెనే వారికి దిక్కవుతోంది.
త్రివేణి నదిపై ఈ వంతెన చాలా వదులుగా ఉందని.. నడుస్తుంటే తాడు ప్రమాదకరంగా ఊగుతోందని విద్యార్థులు భయపడుతున్నారు. రెండు చివర్లలో తాళ్లతో వదులుగా కట్టిన చెక్క పలకలపై జాగ్రత్తగా అడుగులు వేయాలని, దీని వల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దానిపై ఏర్పాటు చేసిన చెక్కలు, కర్రల్లో కొన్ని ఊడిపోయి నీటిలో పడిపోతున్నాయి. నిత్యం ప్రజలు నడిచే ఈ మార్గం కోసం కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని అధికార యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపినట్లు తుమెన్ గ్రామ సర్పంచ్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, వంతెన పరిస్థితిపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో.. తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని అధికారుల తీరుపై మండిపడ్డారు. పిల్లల చదువుకు వంతెనను కూడా నిర్మించలేరా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటక రాయ్ చూర్ జిల్లా దేవరగుడి విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామంలో పాఠశాల లేకపోవడం వల్ల పక్కనే ఉన్న సింధునూర్ నగరానికి వెళ్లి చదువుకుంటున్నారు విద్యార్థులు. కానీ, అక్కడికి వెళ్లాలంటే నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ నిత్యం నీటి ప్రవాహన్ని దాటుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వంతెన నిర్మించాలని కోరుతున్నారు. ఈ వార్త పాతదే అయినా.. తుమెన్ గ్రామం సమస్య వెలుగులోకి రావడంతో ఇది కూడా వైరల్ అవుతోంది.