కాకినాడ (Kakinada) జిల్లా ఓ మారుమూల గ్రామంలో ఉన్న రామాలయానికి విద్యుత్ అధికారులు(Current officers) 4 కోట్ల బిల్లు ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేశారు. ఆ గుడిలో ఉన్నదే రెండు లైట్లు(Two lights) ఓ ఫ్యాన్(Single Fan)..24 గంటలు వాటిని వాడినప్పటికీ కనీసం వెయ్యి రూపాయల బిల్లు వస్తుంది. ఇప్పటి వరకు అలాగే జరిగింది.
చిన్న మొత్తంలో వచ్చే విద్యుత్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉంటారు. ఎప్పట్లాగే ఆగస్టు నెలకు సంబంధించిన కరెంటు బిల్లు కూడా వచ్చింది. ఆ బిల్లు కట్టలేనంత భారీ మొత్తంలో వచ్చింది. నెలనెలా రూ. వెయ్యి వచ్చే కరెంటు బిల్లు.. ఇప్పుడు రూ. 2 వేలు, రూ. 5 వేలో వచ్చిందనుకుంటే పొరబడినట్లే.
కానీ ఆగస్టు నెలలో విద్యుత్ సిబ్బంది ఇచ్చిన బిల్లు చూసి సాక్షాత్తు రాముల వారు కూడా ఖంగు తింటారు. ఎందుకంటే ఆగస్టు నెలలో గుడికి వచ్చిన బిల్లు అక్షరాల రూ. 4 కోట్ల 19 లక్షల 83 వేల 536 రూపాయలు. దీంతో ఆలయ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు.గత ఆగస్టు నెలలో ఒక కోటి 7 లక్షల 37 వేల 455 యూనిట్లు వినియోగించినట్లు మంగళవారం వచ్చిన బిల్లులో చూపడంతో అవాక్కయ్యారు.
వెంటనే విద్యుత్ శాఖ ఏఈ ప్రమోద్ ను కలిశారు ఆలయ నిర్వాహకులు. ఆయన బిల్లును పరిశీలించి మీటర్ రీడింగ్ ను స్కాన్ చేసే సమయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని.. తక్షణమే ఆ బిల్లును సరిచేసి కొత్త బిల్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆలయ నిర్వాహకులు శాంతించారు.