బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగుతోందని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. సీఈసీలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లిస్టు ఫైనల్‌పై ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ గెలుపు గుర్రాలకు సీట్లు ఇవ్వబోతున్నామని వ్యాఖ్యానించారు.
బీసీ ఎజెండాతో తెలంగాణలో బరిలోకి దిగుతున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ఇతర పార్టీలన్నీ బీసీలను ఓటు యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాయని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే మించి బీసీలకు టికెట్లు ఇవ్వబోతున్నామని ఉద్ఘాటించారు. ఏ అవకాశం అయినా బీజేపీలోనే సాధ్యమవుతుందన్న ఆయన ఎంపీలు సైతం పోటీ చేసే అంశంపై చర్చలు సాగుతున్నట్లు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గురువారం సమావేశం నిర్వహించిన అనేక సమావేశాలు నిర్వహించి చర్చించారు. ఈ సమావేశంలో లక్ష్మణ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా పార్టీలోని ప్రధాన నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా సీట్ల కేటాయింపు, మెజారిటీ ప్రజలు టికెట్ ఆశిస్తున్న స్థానాలపై చర్చించారు. అనంతరం కోర్ కమిటీ సభ్యులు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ సమావేశాల అనంతరం గురువారం రాత్రి నడ్డా నివాసంలో కమిటీ మరోసారి సమావేశమైన విషయం తెలిసిందే.