పోలీసుల ఆంక్షలు పనిచేయలేదు.. యథావిథిగా కర్రలు గాల్లోకి లేచాయి. అగ్నిజ్వాలలు ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాయి. ఆచారం పేరిట సాగించిన రణరంగంలో ముగ్గురు మృతిచెందారు. వందకు పైగా తలలు నెత్తురోడాయి. కర్నూలు జిల్లా దేవరగట్టు జాతర(Devaragattu jathara) మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. కర్రల సమరం మరోసారి రక్తసిక్తమైంది.
కర్నూలు(Karnool)లోని దేవరగట్టులో ఏటా దసరా రాత్రి నిర్వహించే దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో(Devaragattu bunny utsav) ఎప్పటిలాగే ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఇనుపరింగుల కర్రలతో కర్రల సమరానికి వచ్చారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు కాగడాల దివిటీలను గాలిలోకి ఎగురేశారు. దీంతో గొడవ మొదలైంది.
దేవరగట్టు కర్రల సమరాన్ని చూసేందుకు స్థానికులు కొంతమంది సమీపంలోని చెట్టు ఎక్కారు. అయితే, ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ విరిగిపడింది. అది అక్కడే ఉన్న గణేష్ అనే యువకుడు మీద పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా కమ్మరపాటుకు చెందిన రామాంజనేయులు, మరో వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు గాయపడినట్లుగా సమాచారం. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కాగా క్షతగాత్రులందరినీ ఆలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
మరోసారి దేవరగట్టులో సంప్రదాయమే గెలిచింది. ఎన్నిసార్లు వారించినా కర్రల సమరం యథావిధిగా కొనసాగింది. దసరా రోజు అర్ధరాత్రి దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం అనంతరం కర్రల సమరాన్ని నిర్వహించడం ఆవాయితీగా వస్తోంది. కల్యాణోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయలుదేరిన సమయంలో గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే నెరణికి, కొత్తపేట, నెరణికి తండా, బిలేహాల్, ఆలూరు, సులువాయి, ఎల్లార్తి గ్రామాల మధ్య కర్రల సమరం కొనసాగుతుంది.