పాక్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్(Abdul Razzaq) నోరుజారాడు. క్రికెట్ గురించి జరుగుతున్న చర్చలో బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachan) పేరు చెబుతూ సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించి విమర్శలపాలయ్యాడు. తోటి క్రికెటర్లు, నెటిజన్లు తప్పుబడుతుండడంతో రజాక్ చివరికి క్షమాపణలు చెప్పాడు.
తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజాక్ తెలిపాడు. ‘‘నేను ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని క్రికెట్ కోచింగ్, దాని ఉద్దేశాలను గురించి మాట్లాడాను. నోరుజారి ఐశ్వర్యారాయ్ పేరును ప్రస్తావించాను. ఆమెకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు.’ అని రజాక్ చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే.. పాక్‌కు చెందిన ఓ టీవీ ఛానల్ చిట్‌చాట్ షోలో పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నాడు. అయితే అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజాక్ సమాధానాలిచ్చాడు. పాకిస్థాన్ టీమ్ పేలవ ప్రదర్శన, అందుకు గల కారణాలను వివరిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును తప్పుబట్టాడు. అదే సమయంలో ఐశ్వర్య రాయ్ పేరును రజాక్ ప్రస్తావించాడు.
‘అసలు క్రికెట్ బోర్డు(పీసీబీ) సంకల్పమే బలంగా లేదు. పాకిస్థాన్‌లో క్రికెటర్ల సామర్థ్యానికి పదును పెట్టాలన్న ఉద్దేశమే వారిలో కనిపించడం లేదు. అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా ఆశిస్తాం. నేను ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుట్టరు కదా. ముందు సంకల్పం దృఢంగా ఉండాలి’ అంటూ సంబంధం లేని విషయాన్ని మధ్యలోకి తీసుకొచ్చాడు. దీంతో విమర్శల పాలై చివరికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థతిని తెచ్చుకున్నాడు.