దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’(RRR) సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పాడు. సినిమాల చిత్రీకరణలో చాలా జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి నటీనటులకూ కెరీర్ పరంగా పలు సూచనలు చేస్తుంటారు. తాజాగా సినిమాల ఎంపిక విషయంలో ఆయన ఇచ్చిన సలహా తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడిందని బాలీవుడ్ భామ అలియాభట్(Alia Bhatt) తెలిపింది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అలియాభట్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రాజమౌళి తనతో అన్న మాటలు మంత్రశక్తిలా పనిచేశాయని చెప్పింది అలియాభట్. ఇప్పుడు మరింత ధైర్యంతో కథల్ని ఎంచుకుంటున్నానని చెప్పింది.
ఓ ఇంటర్వ్యూలో అలియాభట్ మాట్లాడుతూ ‘తొలి నుంచి నాకు కథల ఎంపిక విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉండేది. అనేకసార్లు ఒత్తిడికి లోనైన సందర్భాలున్నాయి. ఆ సమయంలో రాజమౌళి నాతో.. ఓ మాట చెప్పారు. ఏ కథను ఎంచుకున్నా మీ పాత్రను బాగా ప్రేమించండి. అంకితభావంతో శ్రమించండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా వున్నా మీ నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటారు.’
‘ప్రేమతో చేసే పనికి మించిన గొప్ప సంతృప్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదు’ అని రాజమౌళి చెప్పారని అలియాభట్ గుర్తుచేసుకుంది. రాజమౌళిగారి సలహా పాటించిన దగ్గరి నుంచి నేను కథల్ని ఎంచుకునే పద్దతి మారింది’ అని అలియాభట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియాభట్ వాసన్ బాలా దర్శకత్వంలో ‘జిగ్రా’ అనే చిత్రంలో నటిస్తోంది.