తెలంగాణలో (telangana) నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) మొదలవుతున్న విషయం తెలిసిందే.. ఇదే సమయంలో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారాన్ని ప్రొటెమ్ స్పీకర్ సమక్షంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణ స్వీకారం చేయబోమని ప్రకటించారు.
ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)తో కీలక భేటీ తర్వాత తమ నిర్ణయం వెల్లడించారు. అయితే ప్రొటెం స్పీకర్ (Protem Speaker)గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin)ను.. సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేయడం, ఒవైసీ ప్రమాణం కూడా చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది శనివారం ఉదయం కిషన్ రెడ్డిని కలిశారు. వీరంతా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీసులో సమావేశమై.. అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ గా ఒవైసీ ఎంపిక అంశం పై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ తమిళి సై సమక్షంలో రాజ్‌భవన్‌లో.. ప్రొటెం స్పీకర్‌గా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం జరిగింది.
కాగా ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ సంప్రదాయాలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రొటెమ్ స్పీకర్‌గా సీనియర్ వ్యక్తులను నియమించడం ఆనవాయితీగా వస్తోందని… కానీ, ఎమ్ఐఎమ్‌తో కుట్ర పన్ని కాంగ్రెస్ సంప్రదాయాలను పాటించడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు..