ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi Chief Minister Arvind Kejriwal)ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఆందోళన వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ శ్రేణులు వెల్లడించారు. కాంగ్రెస్‌తో తాము పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీ భయపడుతోందన్నారు.
అందుకే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈడీతో పాటు సీబీఐ ఇందుకు సిద్ధమవుతోందని చెప్పారు. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలు కనబడుతున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ అరెస్టుకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే నోటీసులు పంపేందుకు సిద్ధమైనట్లు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
అదే జరిగితే ప్రజా సునామీ వస్తుందన్నారు. అందులో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ హెచ్చరించారు. త్వరలో ఈ ప్రకటన రానుండటంతోనే బీజేపీకి నిద్ర పట్టక కేజ్రీవాల్ అరెస్టుకు కుట్రలు చేస్తోందంటూ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. అందుకే ఈడీ, ఎక్సైజ్ విభాగాలతో సమన్లను పంపిందంటూ ఆయన ఆరోపించారు.