అయోధ్య(Ayodhya)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన నేపథ్యంలో దేశమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. అయోధ్య వెళ్లలేని భక్తుల కోసం పలు ఆలయాల్లో లైవ్ స్ట్రీమింగ్(Live Streaming) ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ రోజున ఇంట్లో ఆచార నియమాల ప్రకారం శ్రీరాముడిని పూజిస్తే పుణ్యం లభిస్తుంది. రాముడిని ఎలా పూజించాలి.. ఎలా దీపాలు వెలిగించాలో తెలుసుకుందాం..
ఇంట్లోనే పూజ చేయాలనుకునే వారు పుజగదిలో పీఠాన్ని ఏర్పాటు చేసి శ్రీరాముడు విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. పంచామృతంతో రాముడి ప్రతిమను శుద్ధి చేయాలి. అనంతరం నీటితో అభిషేకం చేయాలి. శుభ్రంగా పొడివస్త్రంతో విగ్రహాలను తుడిచి వస్త్రాలను ధరింపజేయాలి. చందనంతో తిలకం దిద్దాలి. అనంతరం పూజ గదిని పీఠాన్ని పూలు, దండలతో అలంకరించాలి. అక్షత, పుష్పాలు(ఎరుపు, పసుపు, తెలుపు), పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, తులసి దళం తదితర వాటిని సమర్పించాలి.
మూడు యోగాలు ఏర్పడిన శుభ సందర్భంలో శ్రీరాముడిని పూజించవచ్చు. మధ్యాహ్నం ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడవచ్చు. ఈ ఉదయం నుంచి మృగశిర నక్షత్రం ఉందని బ్రహ్మయోగం ఏర్పడగా ఉదయం 7.15 నుంచి సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడింది. పూజ అనంతరం పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకంలతో పాటు స్వీట్లను శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించాలి.
పూజ సమయంలో రామ నామాన్ని జపించాలి. శ్రీరామ్ చాలీసా పఠించాలి. ఏక స్లోకి రామాయణం కూడా చదవొచ్చు. అనంతరం నెయ్యి దీపం లేదా ఆవనూనె దీపం లేదా కర్పూరంతో శ్రీరాముడికి హారతి ఇవ్వండి. దీపావళి రోజున వెలిగించినట్లుగానే సాయంత్రం వేళ దీపాలను వెలిగించండి. ‘‘ఓం రామచంద్రాయ నమః ఓం రామ రామాయ నమః ఓం నమః శ్రీ రామచంద్ర శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్’’ అనే రామ జపాన్ని పఠించాలి.
అనంతరం మంగళహారతి శ్లోకాలను పఠించాలి. రాముడికి హారతినిస్తూ.. ‘‘ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్.. వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్.. వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్.. పశ్చాద్రావణ కుంభకర్ణ హననం చేతద్ధి రామాయణమ్..’’ అని ఏక స్లోకి రామాయణాన్ని పఠించాలి.