ఆ ఊరు ఎవ్వరినీ అంత ఈజీగా రానివ్వదు.. అంత ఈజీగా పోనివ్వదు. కంచెలా కాపాలా కాస్తుంది. ఓ వాగు ఆ ఊరికి అడ్డు పడుతోంది.ఆ ఊరికి అభివృద్ధి చేరాలంటే వాగుదాటాలి. ఆరోగ్యాని,అనారోగ్యానికి వాగు దాటాలి. ఆ ఊళ్లోవాళ్లకు జ్వరం కాసినా, జబ్బు చేసినా ఆ ఊరికి మొదటిగా అడ్డుపడేది ఆ వాగే.! ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలతో కష్టాలు మరింతపెరిగాయి. ఇది కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని లక్మాపూర్ గ్రామ ప్రజల దు:ఖ దాయని.
ఇటీవల లక్మాపూర్ లో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది. కవిత, పవన్ దంపతులకు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. బాబుకి రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంటోంది. వీరు హాస్పిటల్ వెళ్లాలంటే లక్మాపూర్ వాగు దాటాలి. దీనిపై వంతెనలు లేకపోవడం..వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం లేకపోయింది. చిన్నారిని ఎలాగైనా రక్షించుకోవాలనే బంధువుల తపన వారిని వాగు దాటించేలా చేసింది.
దగ్గరి బంధువు సాయంతో బాబుని బాహుబలిలో శివగామి..మహేంద్ర బాహుబలిని చేతులతో పైకి ఎత్తి పట్టుకున్నట్టుగా పట్టుకుని వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు.ఇదే కాదు..నిత్యావసరాలకు వెళ్లాలన్నా ఇదే దుస్థితి నెలకొందని. బాధితులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
2016లో వంతెన మంజూరై ప్రారంభమైనా నేటికి ఆ పనులు నత్తతో పోటీ పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వచ్చే టీచర్లు సైతం ఈ వాగు దాటాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురిస్తే వాగు దాటే పరిస్థితి లేదని అంటున్నారు. దీంతో మండల కేంద్రానికి గ్రామంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. ఇకనైనా వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.