చలికాలం (Winter) వచ్చిందంటే చాలు చర్మానికి రకరకాల ఇబ్బందులు (skin problems) ఎదురవుతాయి. చలికి చర్మం పొడిబారడం (dryness) చల్లగా వీచే గాలుల కారణంగా చర్మం దురదతో (Itchy skin)ఇబ్బంది పడటం, పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. ఇక చలి ఎక్కువగా ఉందని కొందరు వేడి వేడి నీటితో స్నానం చేయడం చేస్తుంటారు. అదీగాక గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు స్కిన్ పై వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య తలెత్తుతుంది. అందుకే సమస్యను నివారించడానికి నిపుణులు ఇస్తున్న అద్భుతమైన చిట్కాలు మీ కోసం..
చలికాలంలో రకరకాల రుగ్మతలు శరీరంపై దాడి చేస్తాయి. ముఖ్యంగా గాలి ద్వారా వైరస్ ఈ కాలంలో ఎక్కువ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. అందువల్ల శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే, పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో మీ ఆహారంలో.. నెయి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చుకోండని చెబుతున్నారు. అల్లం, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు వేసిన హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగు పరచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ టీల వల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుందని అంటున్నారు.
మరోవైపు శరీరాన్ని గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి పోషణ అంది.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే స్నానానికి వెళ్ళే ముందు శరీరాన్ని నూనెలతో మసాజ్ చేసిన తర్వాత స్నానం చెయ్యడం మంచిదని తెలుపుతున్నారు. శరీరానికి కెమికల్ మిక్స్ అయిన, కఠినమైన సబ్బులు వాడొద్దని. వేప, కలబంద, పసుపు వంటి సహజ పదార్థాలు ఉన్న ఆయుర్వేద సబ్బులు, లోషన్లు వాడండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇవి చర్మానికి తేమను అందిస్తాయని అంటున్నారు. ఈ చలికాలంలో వీలైనంత వరకి శరీరాన్ని వేడిగా ఉంచడానికి చూడాలి.. చలి, చల్లని గాలుల నుంచి రక్షించుకోవడానికి స్వెట్టర్లు, తలకు స్కార్ఫ్, క్యాప్‌లు వంటివి ధరించండని అంటున్నారు.
చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి శరీరానికి తగినంత నీరు అవసరం. అందుకు రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని గుర్తుంచుకోండి. మీరు తాగే నీళ్లలో అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చుకుంటే ఇంకా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నిద్ర చాలా అవసరం. రోజూ కనీసం 8 గంటలైన తప్పని సరిగ్గా నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
నోట్ : సామాజిక మాధ్యమాలలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను తెలియచేస్తున్నాం.. వీటిని ఆచరించే ముందు ఒకసారి సంబంధిత నిపుణుల సలహాల పాటించవలసిందిగా మనవి.