Telugu News » Bhuvanagiri : భువనగిరి ఎస్సీ హాస్టల్‌ ముందు ఉద్రిక్తత.. కీలక మలుపు తిరిగిన విద్యార్థినిల మృతి..!

Bhuvanagiri : భువనగిరి ఎస్సీ హాస్టల్‌ ముందు ఉద్రిక్తత.. కీలక మలుపు తిరిగిన విద్యార్థినిల మృతి..!

వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న నలుగురు 7వ తరగతి విద్యార్థినులు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్‌ వార్డెన్‌ శైలజకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె వీరిద్దరిని మందలించడంతో పాటు హాస్టల్‌లో జూనియర్, సీనియర్‌ విద్యార్థుల ముందు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

by Venu

భువనగిరి (Bhuvanagiri) ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. బీచ్‌ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హైదరాబాద్‌ (Hyderabad), హబ్సిగూడ (Habsiguda)కు చెందిన భవ్య (15), వైష్ణవి (15) అనే విద్యార్థినిలు తాము ఉంటున్న రూమ్ లో ఫ్యానుకు ఊరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకొన్నారు..

మరోవైపు వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న నలుగురు 7వ తరగతి విద్యార్థినులు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్‌ వార్డెన్‌ శైలజకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె వీరిద్దరిని మందలించడంతో పాటు హాస్టల్‌లో జూనియర్, సీనియర్‌ విద్యార్థుల ముందు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని ఫోన్‌ ద్వారా వివరించారు.

ఈ నేపథ్యంలో తాము చెయ్యని తప్పుకు అందరి ముందు నిందించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు.. ఇద్దరి మృతదేహాలను ఒకే దగ్గర సమాధి చెయ్యాలని.. అదే మా చివరి కోరికని తెలిపారు. హాస్టల్ వార్డెన్ ను ఏమి అనవద్దని.. తమను కన్న తల్లి కంటే బాగా చూసుకొన్నారని విద్యార్థినిలు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అయితే అంతా వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని అనుకొన్నారు..

కానీ ఎవరు ఊహించని విధంగా ఈ విద్యార్థినుల మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. బాలికల మృత దేహాలపై పంటి గాట్లు, వాతలు ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు.. ఆరా తీయగా, హాస్టల్లోకి వచ్చిన కొందరు ఆటో డ్రైవర్ లు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసిందిని ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

వార్డెన్, పీఈటీ, ఆటో నిర్వాహకులు ఆంజనేయులు, వంట మనిషిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దోషులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టును, పోలీసులు బయటపెట్టాలని కోరుతూ హాస్టల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో హాస్టల్‌ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకొన్న పోలీసులు హాస్టల్ దగ్గరకి చేరుకొని బాధితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం..

You may also like

Leave a Comment