ఎన్నికలు వచ్చాయంటే రాజకీయాల్లో ఎన్నో సిత్రాలు కనిపిస్తాయి.. పొగుడుకోవడం.. తిట్టుకోవడం.. వంటి ఎన్నో స్టంట్స్ జనాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.. ఇక్కడ శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఉండరని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి.. అయితే భువనగిరి (Bhuvanagiri) సభలో సీఎం రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) ఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) ఈ మాటలపై స్పందించారు. నేడు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టులో వచ్చే సంక్షోభం భయంతోనే రేవంత్.. కోమటిరెడ్డి సీఎం అని అంటున్నారని సెటైర్ వేశారు.. అప్పటి వరకు ఆయన సీఎంగా ఉంటాడో లేదో అనే అపనమ్మకంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని తెలిపిన విషయాన్ని గుర్తు చేసిన మహేశ్వర్ రెడ్డి.. ఆ 20 మందిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారేమోనని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరోవైపు సీఎం హామీలను ప్రజలు నమ్మడం లేదని తెలిపిన ఆయన.. అందుకే దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు. పని చేసే వారికి ఒట్టు వేసే అవసరం లేదని తెలిపారు.
ఇక రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారు సరే.. ఆరు గ్యారెంటీల్లోని మిగతా హామీల సంగతేంటని ఏలేటి ప్రశ్నించారు. ఇలా ఒట్లు వేసుకొంటూ పోతే దేవుళ్ళు కూడా సరిపోరని పేర్కొన్నారు.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాకపోతే క్షమాపణ చెప్పి అధికారం నుంచి తప్పుకోవాలని రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సూచించారు..