బీఎస్పీ(B SP) రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతికి పంపించారు. అనంతరం ఎక్స్(X)వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
బీజేపీ(BJP) ఈ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని ప్రయత్నాలు చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని స్పష్టం చేశారు. చివరివరకు బహుజన వాదాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానంటూ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
ఇటవలే ఆయన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాను ఎక్కడున్నా బహజనుల కోసం కొట్లాడుతానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఎస్పీకి రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని తనను క్షమించాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే.. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే.. నేను నమ్మిన నిజమైన ధర్మ ఇదే..’ అంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. ఎన్నో విలువలున్న పార్టీ ప్రతిష్ట మసక బారడం నాకు ఇష్టం లేదు. నన్ను నమ్ముకున్న వారిని మోసం చేయలేను. నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నానంటూ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ 26ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసి 2021 జూలై 19న స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టులో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. అప్పటి నుంచి బహుజన వాదాన్ని భుజాలపై మోసుకెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ బీఆర్ఎస్ను వ్యతిరేకించిన ఆయన ఎన్నికల తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం గమనార్హం. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు బరువెక్కిన గుండెతో ట్వీట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.