కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) పోలీసులు డ్రగ్స్‌పై డేగ కన్ను వేశారు. సమాచారం అందితే చాలు టక్కున వాలిపోతున్నారు. మాదక ద్రవ్యాలను గుర్తిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.. ఇకపోతే మరికొన్ని గంటల్లో భాగ్యనగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు.
ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాలపై తనిఖీలు మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ప్లబ్‌లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, ఇలా అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో 100 గ్రాముల కొకైన్‌తో పాటు 29 ప్యాకెట్ల బ్రౌన్ షుగర్‌ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. పంజాబ్ నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతోన్న ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
అయితే..మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో బ్రౌన్ షుగర్ (Brown Sugar)ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవటం గమనార్హం. కాగా పంజాబ్ (Punjab)లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతోన్న నవీన్‌తో పాటు వీర సాయి తేజను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. న్యూ ఇయర్ కోసం పెద్ద మొత్తంలో హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలు తీసుకొచ్చినట్టు గుర్తించారు.. గత నాలుగేళ్లుగా న్యూ ఇయర్ వేడుకలకు ఢిల్లీ, పంజాబ్ నుంచి వీటిని తీసుకొస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు.
న్యూఇయర్ వేడుకల నేపథ్యంగా, స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించారు.. మద్యం తాగినవారి కోసం బ్రీత్ అనలైజర్లతో పాటు, మాదక ద్రవ్యాలు సేవించినవారిని గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు సైతం తెప్పించారు. అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు..