తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాళేశ్వరం వ్యవహారం కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య మల్ల యుద్ధాన్ని తలపిస్తోంది. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ దూకుడుగా ప్రవర్తిస్తుండగా.. డ్యామ్ విషయంలో అసలు అవినీతి జరగలేదని సమర్థించుకొంటున్న బీఆర్ఎస్.. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి నేడు మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్టు సందర్శనకు బయలు దేరారు..
హైదరాబాద్ (Hyderabad) బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి నేతలు వోల్వో బస్సుల్లో బయలుదేరారు.. కానీ ఊహించని విధంగా వీరు ప్రయాణిస్తున్న బస్సు టైరు బరస్ట్ అయ్యింది. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన వీరి బస్సు.. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలోకి రాగానే.. బస్సు టైరు పేలిపోయింది. పెద్ద శబ్ధంతో టైరు పేలటంతో బీఆర్ఎస్ నేతలు.. భయంతో కూడుకొన్న అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ విషయాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్.. బస్సును రోడ్డున పక్కన నిలిపివేశాడు. అందుబాటులో ఉన్న మెకానిక్ ను తీసుకొచ్చి టైరు మార్పించారు.. కాగా ఈ బస్సులో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నట్లు సమాచారం.. వీరితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరిపీల్చుకొన్నారు. అయితే మేడిగడ్డ వెళుతున్న సమయంలో ఇలా జరగడం అపశకునంగా భావిస్తూ.. కొందరు నేతలు చర్చించుకోన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే బీఆర్ఎస్ నేతలు తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం తలకిందులైంది. ఫలితంగా పార్టీ పునాది భూ పలకలు మరో చోటికి వేగంగా కదిలి పోతున్నాయి. ఇలాంటి సమయంలో చలో మెడిగడ్డ పేరిట సానుభూతి కూడగట్టుకొనే పనిలో గులాబీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.