ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓటమి పాలవడంతో ఆ పార్టీలోని సిట్టింగ్ ఎంపీ(MP)లు, ఎమ్మెల్యే(MLA)లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరో ముగ్గురు గులాబీ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతలపై జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వారెవర్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొందరు బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి రాజీనామా చేయకుండా ఎలా పార్టీ మారుతున్నారని ప్రశ్నించారు. అక్రమాన్ని సక్రమం చేసుకోవడానికి మరికొందరు స్వార్థపరులు పార్టీ మారుతున్నారని మండిపడ్డారు.
వారి అక్రమాల చిట్టాను బయటపెడతామన్నారు. పార్టీ మారుతున్న స్వార్థపరుల అక్రమాలను ప్రతిపక్షంలో ఉండి కూడా చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. అధికార పార్టీలోకి వెళ్లి ఇలాగే అక్రమాలు చేస్తే ప్రజలతో చెప్పులతో కొట్టిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.