Telugu News » Telangana : ఇంగ్లీష్.. వింగ్లీష్..! రేవంత్‌ను తక్కువ చేద్దామని.. ఉన్న ఇజ్జత్ తీసుకున్న కేటీఆర్ టీమ్

Telangana : ఇంగ్లీష్.. వింగ్లీష్..! రేవంత్‌ను తక్కువ చేద్దామని.. ఉన్న ఇజ్జత్ తీసుకున్న కేటీఆర్ టీమ్

అలాంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాషపై ప్రస్తుతం విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. దీని వెనుక సోషల్ మీడియా విభాగంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పాత్ర ఉందని హస్తం శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

by Ramu
ktr

– సీఎం భాషపై దారుణమైన ట్రోల్
– పెట్టుబడుల అంశాన్ని సైడ్ చేసే కుట్రేనా?
– గతేడాది కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులెన్ని?
– వాటిలో క్షేత్ర స్థాయిలో అమలైనవి ఎన్ని?
– అంతకంటే ఎక్కువే తెచ్చిన రేవంత్‌పై ట్రోలింగ్ ఎందుకు?
– పెట్టుబడులు.. రాజకీయ సెగలు

తెలంగాణ అస్తిత్వం.. భాష, యాస అంటూ తెలంగాణ ఉద్యమం (Telangana Movement) సాగింది. మన నీళ్లు.. మన నిధులు.. మన నియామకాలు అంటూ తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో ఉవ్వెత్తున ఎగిసి.. సకలజనులు కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాషపై ప్రస్తుతం విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. దీని వెనుక సోషల్ మీడియా విభాగంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పాత్ర ఉందని హస్తం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పటడుగులు, తప్పిదాలను గుర్తు చేస్తూ మండిపడుతున్నాయి.

ktr

 

దావోస్ పర్యటనలో భాగంగా ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన తడబడుతూ మాట్లాడటం చూసి.. దానికి కేసీఆర్, కేటీఆర్ ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోలను యాడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దావోస్‌లో రేవంత్ రెడ్డి తనను తాను నవ్వుల పాలు చేసుకుంటున్నారని, ప్రపంచ వేదికపై అసంబద్ధమైన, అసమర్థమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి తల వంపులు తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తెగ గగ్గోలు పెడుతున్నాయి.

గులాబీల ట్రోలింగ్ పై హస్తం శ్రేణులు కూడా ఎటాక్ మొదలు పెట్టాయి. రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి కావలసిన పరిపాలనా దక్షత రేవంత్ రెడ్డికి ఉందని, అయినా.. ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మాత్రమే కాదని అంటున్నాయి. ఇంగ్లీష్ పండిట్ అని చెప్పుకునే కేటీఆర్… గతేడాది దావోస్ పర్యటనలో 21వేల కోట్ల రూపాయలను మాత్రమే తీసుకొచ్చారని.. అదే, 2022లో అయితే కేవలం 4,200 కోట్లు మాత్రమే తీసుకొచ్చారని గుర్తు చేస్తున్నాయి. పైగా, వాటిలో ఎన్ని క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మారాయో ఎవరికీ తెలియదని అంటున్నాయి.

కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఏడాది దాదాపు 40వేల కోట్ల రూపాయల దాకా పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకున్నారని కౌంటర్ ఇస్తున్నాయి. తమది మాటల ప్రభుత్వం కాదని.. కేటీఆర్ మాదిరిగా పెట్టుబడుల డ్రామాలు చేయబోమని అంటున్నాయి హస్తం శ్రేణులు. అయినా.. ఇంగ్లీష్ మాట్లాడితేనే పెట్టుబడులు రావన్న విషయం తెలుసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నాయి.

అసలు, సీఎం హోదాలో కేసీఆర్ ఏనాడైనా దావోస్ వెళ్లారా? తన కుమారున్నే పంపారు.. ఇప్పుడు రేవంత్ వెళ్తే ఇంతగా ట్రోల్ చేస్తారా? అంటూ నిలదీస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం అంటూ ఒకనాడు రాష్ట్రం కోసం కొట్లాడామని చెప్పుకునే బీఆర్ఎస్.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదంటూ విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడుతున్నాయి. కేటీఆర్ అద్భుతమైన ఇంగ్లీష్‌లో మాట్లాడి గత రెండేళ్లలో కేవలం 25వేల కోట్లు మాత్రమే తెచ్చారని గుర్తు చేస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు న్యూస్ కోసమై ఇవి చదవండి…!

 

You may also like

Leave a Comment